Godhuma Rava Kesari : మనం గోధుమరవ్వను కూడా ఆహారంగా తీసుకుంటాము. గోధుమరవ్వ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఉప్మా, కిచిడీ వంటి వాటితో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. గోధుమరవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో గోధుమ రవ్వ కేసరి కూడా ఒకటి. ఈ కేసరి చూడడానికి అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదంగా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ గోధుమరవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు, బ్రౌన్ కలర్ లో ఉండే గోధుమరవ్వ – ఒక కప్పు, నీళ్లు – 4 కప్పులు, పంచదార – ఒకటిన్నర కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, జాజికాయ పొడి – చిటికెడు, పచ్చకర్పూరం – చిటికెడు.
గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగుతుండగానేమరో గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. రవ్వను చిన్న మంటపై దోరగా వేయించిన తరువాత వేడి నీటిని పోసి కలపాలి. ఈ రవ్వను కలుపుతూ 90 శాతం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. రవ్వ ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమరవ్వ కేసరి తయారవుతుంది. ఇందులో పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కేసరిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.