Mango Pepper Rasam : మామిడికాయ మిరియాల చారు.. మామిడికాయ, మిరియాలు కలిపి చేసే ఈ చారు పుల్ల పుల్లగా,ఘాటుగా చాలా రుచిగా ఉంటాయి. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా పుల్ల పుల్లగా చారును తయారు చేసి తీసుకోవచ్చు. చింతపండుకు బదులుగా మామిడికాయతో చేసే ఈ చారు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ మామిడికాయ మిరియాల చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ మిరియాల చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన కందిపప్పు – అర కప్పు, నీళ్లు – ఒకటింపావు కప్పు, పుల్లటి మామిడికాయ – 1, మెంతులు – ముప్పావు టీ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర -అర టీ స్పూన్, ఇంగువ- పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – 2 రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
మామిడికాయ మిరియాల చారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తరువాత మామిడికాయను మెత్తగా ఉడికించి గుజ్జు తీసుకోవాలి. తరువాత కళాయిలో మెంతులు, ధనియాలు, మిరియాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మామిడికాయ గుజ్జులో పావు లీటర్ నీళ్లు పోసి కలపాలి. ఈ నీటిని కళాయిలో పోసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి.
తరువాత పప్పు వేసి కలపాలి. ఇందులోనే మరో పావు లీటర్ నీళ్లు పోసి కలపాలి. ఈ చారును 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ మిరియాల చారు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.