Fish Bhurji : మనం చేపలతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. చేపలతో మనం ఎక్కువగా పులుసు, వేపుడు, ఇగురు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. చేపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చేపలతో తరుచూ చేసే వంటకాలతో పాటు చేపల పొరటును కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే ఫిష్ బుర్జీ అని కూడా అంటారు. ఫిష్ బుర్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా ఫిష్ బుర్జీని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఫిష్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిష్ బుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – అరకిలో, నూనె – అర కప్పు, ఆవాలు -అర టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 3, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఫిష్ బుర్జీ తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత అందులో చేప ముక్కలను వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వాటిపై ఉండే చర్మాన్ని తీసి వేయాలి. తరువాత చేప ముళ్లులను కూడా నెమ్మదిగా వేరు చేయాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత చేప పొరుటు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తరువాతగరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫిష్ బుర్జీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.