Beans Fry : మనం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీన్స్ లో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఇతర వంటకాల్లో వాడుతూ ఉంటారు. అలాగే బీన్స్ తో కూడా వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. బీన్స్ తో చేసుకోదగిన వంటకాల్లో బీన్స్ ఫ్రై కూడా ఒకటి. బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. తక్కువ నూనెతో పోషకాలు పోకుండా కూడా ఈ ఫ్రైను తయారు చేసుకోవచ్చు. తక్కువ నూనెతో పోషకాలు పోకుండా బీన్స్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బీన్స్ – పావుకిలో, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – పావు కప్పు, నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీన్స్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా జార్ లో శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిని స్టవ్ మీద ఉంచి లో బీన్స్, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి నీరంతా పోయే వరకు వేయించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు,ఎండుమిర్చి వేసి వేయించాలి.తరువాత మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి వేయించాలి. తరువాత ఉడికించిన బీన్స్ వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా బీన్స్ ఫ్రైను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.