Potato Carrot Fritters : బంగాళాదుంపలతో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లల్లో పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇన్ స్టాంట్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంప – పెద్దది ఒకటి, క్యారెట్ – పెద్దది ఒకటి, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, సన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్స్.
పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపపై ఉండే చెక్కును తీసేసి వీలైనంత సన్నగా తురుముకోవాలి. తరువాత ఈ తురుమును నీటిలో వేసి కడగాలి. ఇప్పుడు నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే క్యారెట్ ను కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. తరువాత కార్న్ ఫ్లోర్ తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్దిగా బంగాళాదుంప మిశ్రమాన్ని కళాయిలో వేసి పలుచగా ఫ్రిట్టర్స్ లాగా వత్తుకోవాలి. కళాయికి తగినన్ని వేసుకున్న తరువాత మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఫ్రిట్టర్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు.