Dosakaya Kalchina Pachadi : దోసకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూర, పప్పు వంటి వాటితో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈపచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ పచ్చడిని మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. దోసకాయను కాల్చి చేసే ఈ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అమ్మమ్మల కాలంలో తయారు చేసేవారు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. దోసకాయను కాల్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ కాల్చిన పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దోసకాయ – పెద్దది ఒకటి. నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, పచ్చిమిర్చి – 15, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఇంగువ – 2 చిటికెలు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – అర కట్ట, చింతపండు – ఒక రెమ్మ.
దోసకాయ కాల్చిన పచ్చడి తయారీ విధానం..
ముందుగా దోసకాయకు నూనె రాసి మంటపై కాల్చుకోవాలి. దోసకాయ నల్లగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత మినపప్పు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత జీలకర్ర, ఇంగువ వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయపై ఉండే నల్లటి పొట్టును తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత జార్ లో వేయించిన దినుసులు, పచ్చిమిర్చివ వేసుకోవాలి. తరువాత కొత్తిమీర, చింతపండు, దోసకాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ కాల్చిన పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు దోశ, అట్టు వంటి వాటితో కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.