Dhaba Style Dal Palak : మనకు ధాబాలల్లో లభించే దాల్ వెరైటీలల్లో దాల్ పాలక్ కూడా ఒకటి. పాలకూరతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ దాల్ పాలక్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దాల్ పాలక్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ దాల్ పాలక్ ను ధాబా స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వెరైటీగా తినాలనుకునే వారు ఇలా ఇంట్లోనే ధాబా స్టైల్ లో తయారు చేసి తీసుకోవచ్చు. ధాబా స్టైల్ దాల్ పాలక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్ పాలక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, నెయ్యి – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన పాలకూర – ఒక కట్ట(మధ్యస్థంగా ఉన్నది), తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
దాల్ పాలక్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో శనగపప్పు, నీళ్లు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి వేసి మూత పెట్టాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కళాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత పాలకూర వేసి కలపాలి. పాలకూర మగ్గిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. టమాట మగ్గిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.తరువాత ఉడికించిన పప్పును నీటితో సహా వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ పాలక్ తయారవుతుంది. దీనిని రోటీ, చపాతీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలకూరతో పప్పును తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.