Simple Egg Curry : కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరుచూ చేసే కూరలతో పాటు కింద చెప్పిన విధంగా కూడా రుచికరమైన కూరను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, సులభంగా చేసుకోదగిన ఈ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్, ఉడికించిన కోడిగుడ్లు – 4, చికెన్ మసాలా – పావు టీ స్పూన్, పుదీనా ఆకులు – 4, తరిగిన పచ్చిమిర్చి – 3, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి ఉల్లిపాయలను మగ్గించాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా మగ్గే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. తరువాత చికెన్ మసాలా, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.