Cauliflower Masala Curry : మనం క్యాలీప్లవర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా క్యాలీప్లవర్ తో మనం రుచిగా క్యాలీప్లవర్ మసాలా కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాలీప్లవర్ ను తినని వారు కూడా ఈ కర్రీని ఇష్టంగా తింటారు. క్యాలీప్లవర్ తో రుచిగా మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – చిన్నది ఒకటి, నూనె – ఒక టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – 2, జీడిపప్పు – 6, తరిగిన టమాటాలు – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్ లేదా తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాలీప్లవర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు, పప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలు వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి ముక్కలను ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి రెమ్మలు, మసాలా దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
తరువాత కొద్దిగా ఉప్పు,కారం వేసి కలపాలి. తరువాత క్యాలీప్లవర్ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.