Kasuri Methi : కసూరిమేతి.. వంటల్లో రుచి కొరకు, వాసన కొరకు దీనిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. మెంతి ఆకులను ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. ఎంతోకాలంగా కసూరిమేతిని మనం వంటల్లో వాడుతూ ఉన్నాము. కసూరిమేతి వేయడం వల్ల వంటలు మరింత రుచిగా, కమ్మటి వాసనను కలిగి ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాకుండా కసూరిమేతిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కసూరి మేతిని వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కసూరి మేతిలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా చేయడంలో సహాయపడతాయి. కసూరి మేతి కొద్దిగా చేదుగా ఉంటుంది. వంటల్లో దీనిని వాడడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.
చల్లటి వాతావరణం కలిగి ఉన్న వారు కసూరి మేతిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా కసూరి మేతి మనకు సహాయపడుతుంది. కసూరి మేతిని వాడడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. కసూరి మేతి యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు, శరీరంలో వాపులు, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో కూడా కసూరి మేతి మనకు సహాయపడుతుంది. రక్తంలో స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇన్సులిన్ సెన్సెటివిటిని మెరుగుపరచడంలో కసూరి మేతి మనకు దోహదపడుతుంది. బరువు తగ్గడంలో కూడా కసూరి మేతి మనకు మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కనుక కసూరి మేతిని వాడడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కసూరిమేతిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. కసూరి మేతిని వాడడం వల్ల చర్మం పొడిబారడం, చర్మం నిర్జీవంగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అదే విధంగా కసూరి మేతిని వాడడం వల్ల శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి. దగ్గు, శ్లేష్మం, కఫం వంటి సమస్యలను తగ్గించడంలో కసూరి మేతి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కసూరిమేతిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలానుగుణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా కసూరి మేతి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా అందరూ వీలైనంత వరకు వంటల్లో వాడే అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.