Left Over Chicken Curry Samosa : మనం స్నాక్స్ గా తీసుకునే వాటిలో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సమోసాలను వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. వాటిలో చికెన్ సమోసాలు కూడా ఒకటి. చికెన్ సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే అప్పటికప్పుడు తయారు చేసే చికెన్ స్టఫింగ్ కు బదులుగా మిగిలిన చికెన్ తో కూడా ఈ సమోసాలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చికెన్ కర్రీ మిగిలినప్పుడు దానితో ఇప్పుడు చెప్పే విధంగా సమోసాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ చికెన్ సమోసాలను తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో రుచిగా, క్రిస్పీగా వీటిని తయారు చేసుకోవచ్చు. మిగిలిన చికెన్ తో చికెన్ సమోసాలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కర్రీ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ కర్రీ – 400గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – కొద్దిగా, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, సమోసా షీట్స్ – తగినన్ని.
చికెన్ కర్రీ సమోసా తయారీ విధానం..
ముందుగా చికెన్ కర్రీలో ఉండే ముక్కలను తీసుకుని వాటిలో ఉండే ఎముకలను తీసేసి మెత్తటి చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఈ చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిన్నగా చేసుకున్న చికెన్ ను వేసి వేయించాలి. చికెన్ లోని తడి పోయే వరకు వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు వేసి వేయించాలి. వీటిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత సమోసా షీట్ లను తీసుకుని వాటిని సమోసా ఆకారంలో మడవాలి.
తరువాత ఇందులో చికెన్ స్టఫ్ ను ఉంచి అంచులకు మైదాపిండి పేస్ట్ ను రాసుకుని అంచులను మూసివేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో డీప్ ప్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక సమోసాలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ సమోసాలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే మరింత రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన సమోసాలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.