Guthi Vankaya Kura : మనం గుత్తి వంకాయలతో రకరకాల కూరలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. గుత్తి వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే గుత్తి వంకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కోరుకునే వారు దీనిని తప్పక రుచి చూడాల్సిదే. మరింత రుచిగా, కమ్మగా గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – ఉసిరికాయంత, గుత్తి వంకాయలు – పావుకిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 2, నీళ్లు – అరగ్లాస్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
వేడి నీటిలో నానబెట్టిన ఎండుమిర్చి – 10 నుండి 15, వేయించిన పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వేయించిన ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెమ్మలు – 10, తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, పుదీనా ఆకులు – గుప్పెడు, ఉప్పు – తగినంత.
గుత్తి వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వంకాయలను 4 ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత తగినంత చింతపండు రసం వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి ఉడికించాలి. దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత వంకాయలు వేసి కలపాలి. తరువాత నీళ్లు, గరం మసాలా వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. కూర ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన గుత్తి వంకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.