Instant Medu Vada : పప్పు నానబెట్టకుండా రుచికరమైన, క్రిస్పీ వడలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పప్పు నానబెట్టి రుబ్బే పనిలేకుండా చాలా సులభంగా వడలను తయారు చేసి తీసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం తయారు చేయాలో తోచనప్పుడు బియ్యంపిండితో అప్పటికప్పుడు ఇలా వడలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా కూడా వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండేలా బియ్యంపిండితో ఇన్ స్టాంట్ గా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యంపిండి వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, నిమ్మరసం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బియ్యంపిండి వడల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, నిమ్మరసం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిని వేసి కలుపుతూ ఉడికించాలి. దీనిని మధ్యస్థ మంటపై చపాతీ పిండిలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి.
దీనిని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తరువాత చేత్తో వత్తుతూ బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడలాగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యంపిండి వడలు తయారవుతాయి. వీటిని టమాట చట్నీ, పల్లి చట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.