Bengali Style Rava Burfi : బొంబాయి రవ్వతో మనం రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రవ్వ బర్ఫీ కూడా ఒకటి. తరుచూ చేసే రవ్వ బర్ఫీ కంటే కింద చెప్పిన విధంగా చేసే రవ్వ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా వెస్ట్ బెంగాల్ వారు నవరాత్రుల్లో నైవేధ్యంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ రవ్వ బర్ఫీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, బిర్యానీ ఆకులు – 3, జీడిపప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 3 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – 2 కప్పులు, పంచదార – ఒక కప్పు, రెడ్ కలర్ – 2 చిటికెలు, ఆరెంజ్ కలర్ – 2 చిటికెలు.
రవ్వ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత రవ్వ, బిర్యానీ ఆకులు వేసి రవ్వను వేయించాలి. ఈ రవ్వ సగానికి పైగా వేగిన తరువాత జీడిపప్పు పలుకులు, తరిగిన ఎండుద్రాక్ష వేసి కలపాలి. రవ్వ మంచి రంగు వచ్చే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత ఫుడ్ కలర్స్ వేసి కలపాలి. దీనిని కలుపుతూచ 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ రవ్వ మిశ్రమం ముద్దగా అయ్యి కళాయికి అంటుకోకుండా తయారైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ ఆకులను తీసి వేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిని 2 గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాత పైన బాదం పలుకులను చల్లుకుని మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బర్ఫీ తయారవుతుంది. ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.