Mango Murabba : మ్యాంగో మురబ్బా.. పచ్చి మామిడికాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ మ్యాంగో మురబ్బాను ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు తినవచ్చు. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. పచ్చి మామిడికాయలు లభించినప్పుడు దీనిని తయారు చేసి సంవత్సరమంతా వాడుకోవచ్చు. ఈ మ్యాంగో మురబ్బాను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. కట్టా, మీటా రుచితో ఉండే ఈ మ్యాంగో మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో మురబ్బా తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి పచ్చిమామిడికాయలు – 5, బెల్లం తురుము – ఒక కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పు, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్.
మ్యాంగో మురబ్బా తయారీ విధానం…
ముందుగా మామిడికాయలపై ఉండే చెక్కును తీసి వేయాలి. తరువాత వీటిని తురుముకోవాలి.ఈ మామిడికాయల తురుము 3 కప్పులు అయ్యేలా చూసుకోవాలి. తరువాత ఈ తురుమును కళాయిలో వేసుకోవాలి. ఇందులోనే బెల్లం తురుము, పంచదార వేసి కలపాలి. దీనిని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి. బెల్లం కరిగిన తరువాత జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. మామిడికాయ మిశ్రమం ఉడికి దగ్గర పడిన తరువాత పాకం చూసుకోవాలి. బెల్లం తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో మురబ్బా తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, బ్రెడ్, దోశ వంటి వాటితో తిన్నా,నేరుగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మ్యాంగో మురబ్బాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.