Aged Persons : 50 ఏళ్లు దాటడం అంటే వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తున్నట్లే. ఈ వయస్సులో ఆరోగ్యం పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి. ఏ చిన్న పొరపాటు చేసినా తీవ్ర సమస్యగా మారి ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది. ఈ వయస్సులో గుండె పోటు, హైబీపీ, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో అవి వచ్చాక బాధపడడం కన్నా రాకముందే వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అందుకనే పలు రకాల పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ తింటే చాలు, వృద్ధాప్యంలో వచ్చే ఆయా అనారోగ్య సమస్యలను రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. అందుకుగాను 50 ఏళ్లు దాటిన వారు రోజూ తినాల్సిన ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
50 ఏళ్లు దాటిన వారు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వాపులు, శరీరంలో ఇతర చోట్ల నొప్పులు రాకుండా ఉండాలంటే రోజూ వారు తమ ఆహారంలో బెర్రీలను చేర్చుకోవాలి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, చెర్రీ పండ్లను తింటుండాలి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాపులు, నొప్పులు రాకుండా చూస్తాయి. 50 ఏళ్లు పైబడిన వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ బెర్రీ పండ్లను రోజూ తింటే వాపులు, నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ వయస్సులో కండరాలు కూడా సక్రమంగా పనిచేయాలి. కానీ కొందరికి కండరాల వాపులు, నొప్పులు వస్తాయి. కనుక ఇవి రాకుండా ఉండాలంటే రోజూ ఆహారంలో అవకాడోలను చేర్చుకోవాలి.
అవకాడోలలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలు పట్టుకుపోకుండా చూస్తుంది. దీంతో కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే 50 ఏళ్లు దాటిన వారికి శరీరంలో రక్తం గడ్డ కట్టడం లేదా షుగర్, రక్త సరఫరా సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కనుక వీటిని అడ్డుకోవాలంటే రోజూ ఒక నారింజ పండును తినాలి. అదేవిధంగా ఈ వయస్సులోని వారికి గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీరు రోజూ ఒక యాపిల్‌ను తినాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
50 ఏళ్లు దాటిన వారికి హైబీపీ వచ్చే చాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు వారు రోజూ అరటి పండ్లను తినాలి. ఈ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. ఇలా ఈ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల 50 ఏళ్లకు పైబడిన వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.