Street Style Chicken Pakodi : మనకు సాయంత్రం సమయాల్లో బయట బండ్ల మీద లభించే వాటిలో చికెన్ పకోడి కూడా ఒకటి. చికెన్ పకోడి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే బయట ఎక్కువ ధరకు కొనే బదులు రుచికరమైన చికెన్ పకోడిని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా చికెన్ పకోడిని తయారు చేసుకుని స్నాక్స్ లాగా తినవచ్చు. బయట బండ్ల మీద లభించే రుచితో ఇంట్లోనే చికెన్ పకోడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – 300గ్రా., ఉప్పు – తగినంత, కారం – 2 నుండి 3 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – గుప్పెడు, కోడిగుడ్డు – 1.
చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో జీడిపప్పు, కోడిగుడ్డు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సమయం ఉన్న వారు ఈ చికెన్ ను ఫ్రిజ్ లో ఉంచి రాత్రంతా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. చికెన్ ను మ్యారినేట్ చేసుకున్న తరువాత ఇందులో జీడిపప్పు, సగం కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ను వేసి వేయించాలి. దీనిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించి చికెన్ పై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే చికెన్ పకోడి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ పకోడిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.