Bendakaya Rice : బెండకాయ రైస్.. సాధారణంగా మనం బెండకాయలతో వేపుడు, కూర, పులుసు వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాము. కానీ బెండకాయలతో మనం వెరైటీగా బెండకాయ రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు చాలా సులభంగా, తక్కువ సమయంలో రైస్ ను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బెండకాయలు ఇష్టపడని పిల్లలు కూడా ఈ రైస్ ను ఇష్టంగా తింటారు. బెండకాయలతో రుచిగా, సులభంగా బెండకాయ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – 200గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, కూర కారం – ఒక టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు – ఒక టేబుల్ స్పూన్, పల్లి పొడి – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చిమిర్చి – 2, అన్నం – 2 కప్పులు.
బెండకాయ రైస్ తయారీ విధానం..
ముందుగా జార్ లో ఎండుకొబ్బరి పొడి, కారం, ఉప్పు, పుట్నాల పప్పు, పల్లిల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని 60 శాతం వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ఈ బెండకాయ ముక్కలను పూర్తిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడిచేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు అన్నం, ముందుగా సిద్దం చేసుకున్న పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ రైస్ తయారవుతుంది. ఈ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈవిధంగా చాలా సులభంగా చాలా త్వరగా లంచ్ బాక్స్ లోకి బెండకాయ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు.