Nutrition : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం కూడా అంతే అవసరం. పోషకాలు అంటే మనకు కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులే కాదు.. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉండే ఆహారాలను మనం రోజూ తినాలి. ముఖ్యంగా తృణ ధాన్యాలు, పప్పులు, రంగు రంగుల కూరగాయలు, ప్రొ బయోటిక్ ఫుడ్స్‌ను తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొందరు తాము ఈ ఆహారాలను రోజూ తింటున్నా కానీ పోషణ లభించడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో, ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ మనం పోషకాలు కలిగిన అన్ని ఆహారాలను తింటున్నప్పటికీ మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల మనకు పోషణ సరిగ్గా లభించదు. దీంతో మన ఆరోగ్యం చిక్కుల్లో పడిపోతుంది. అయితే మనకు పోషకాలు సరిగ్గా లభించాలంటే మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి లంచ్, డిన్నర్‌లను సరైన టైములో చేయాలి. అప్పుడే మన శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. దీంతో పోషకాలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్‌ను తినేయాలి. మధ్యాహ్నం 1 గంట లోపు లంచ్ పూర్తి చేయాలి. రాత్రి 8 గంటల లోపు డిన్నర్ చేసేయాలి.
రాత్రి తిన్న తరువాత నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకునే విషయంలో సమయ పాలన పాటించాలి. అప్పుడే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇక కొందరు తిన్న వెంటనే లేదా తింటానికి ముందు నీళ్లను తాగుతారు. ఇలా కూడా చేయకూడదు. కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలి. లేదంటే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు మనకు సరిగ్గా లభించవు. ఇక కొందరు భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగుతారు. ఇలా తాగితే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. కనుక ఇలా కూడా చేయకూడదు. ఇక కొందరు చాలా వేగంగా భోజనం చేస్తారు. ఇది కూడా మంచిది కాదు. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పోషకాలు లభించవు. ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ మింగినప్పుడే సరిగ్గా జీర్ణమై దాని ద్వారా మనకు పోషకాలు లభిస్తాయి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రోజూ మనం తినే ఆహారం ద్వారా వచ్చే పోషకాలను మన శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. లేదంటే పోషకాహార లోపం బారిన పడతారు.