Yoga : మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు యోగా, ధ్యానం కూడా చేయాలి. దీంతో మీరు శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ క్రమంలోనే వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు మనకు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మనల్ని తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే యోగా లేదా ప్రాణాయామం ఏది చేసినా వీటిని ఆరంభించేవారు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ రోజువారి దినచర్యలో భాగంగా యోగా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే యోగా చేయడం అన్నది అంత సులభం కాదు. ఎంత సులభమైన ఆసనం వేసినప్పటికీ కొన్ని సార్లు మన శరీరం అంతగా వంగదు. ఆయా భాగాలు అంత సులభంగా వంగిపోవు. దీంతో మనం వాటిని బలవంతంగా వంచేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఇలా అసలు చేయకూడదని యోగా నిపుణులు చెబుతున్నారు. శరీరం ఎంత వరకు సాగుతుందో అంత వరకే శరీర భాగాలను వంచాలి. బలవంతం చేయకూడదు. ఇలా వీలున్నంత వరకే చేస్తే రాను రాను మీ శరీర భాగాలు బాగా సాగుతాయి. దీంతో మీరు మీ శరీరాన్ని ఎటంటే అటు సులభంగా వంచుతారు.
యోగా చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్లు శ్వాస తీసుకోకూడదు. అలా చేస్తే మీరు యోగా చేసిన ఫలితం ఉండదు. యోగా చేసేటప్పుడు శ్వాసను నియంత్రించడం, అవసరం ఉన్నప్పుడు వదలడం, అవసరం ఉన్నపుడు గాలి పీల్చిడం ముఖ్యం. కనుక వీటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు చేసే యోగాకు తగిన ఫలితం లభిస్తుంది. ఇక యోగా లేదా ప్రాణాయామం ఏది చేసినా ఖాళీ కడుపుతో చేయాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కేవలం కొన్ని యోగాసనాలను మాత్రమే భోజనం తరువాత చేసేందుకు వీలుంటుంది. మిగిలిన అన్ని ఆసనాలను ఖాళీ కడుపుతోనే వేయాలి. ఆహారం తిని వేయకూడదు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి.
యోగా చేసే ముందు మీరు మీ శరీరాన్ని కాస్త వార్మప్ చేస్తే మంచిది. దీంతో యోగా చేయడం సులభతరం అవుతుంది. ఈ విధంగా యోగాను ప్రారంభించే వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే రాను రాను మీకు యోగా అలవాటు అవుతుంది. దీంతో ఎంతో కష్టతరమైన ఆసనాలను సైతం మీరు సులభంగా వేయగలుగుతారు. దీంతో మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. వ్యాధులు తగ్గుతాయి.