Tea : చాలా మంది రోజూ ఉదయం నిద్రలేవగానే తమ రోజును టీ తో ప్రారంభిస్తారు. టీ తాగకపోతే ఉదయం ఏమీ తోచదు. ఉదయం చాలా మంది బెడ్ టీ తాగుతారు. ఇక కొందరు టిఫిన్ చేసిన తరువాత టీ తాగుతారు. అయితే చాలా మంది రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా టీ తాగుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే దీనిపై వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూ మరీ అంత ఎక్కువగా టీ తాగకూడదని, టీ తాగేందుకు కూడా మోతాదు ఉంటుందని, అది తెలుసుకోకపోతే నష్టపోతారని అంటున్నారు. మరి టీని రోజూ ఎంత మొత్తంలో తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా.
మనం రోజుకు టీని 1 లేదా 2 కప్పులకు మించవద్దని వైద్యులు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువగా తాగితే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారంటున్నారు. టీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ పేరుకుపోతుంది. ఇది గుండె, కిడ్నీలు, మెదడుపై ప్రభావం చూపిస్తుంది. కనుక టీని ఎక్కువగా తాగకూడదు. టీని అధికంగా సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్, కడుపులో మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల టీ ని తక్కువగా తాగాల్సి ఉంటుంది.
టీని తాగడం వల్ల మనకు లాభాలే కలుగుతాయి. అయినప్పటికీ మనం ఏ సమయంలో పడితే ఆ సమయంలో టీని తాగకూడదు. ముఖ్యంగా ఉదయం బెడ్ టీ తాగకూడదు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన వెంటనే తాగకూడదు. భోజనానికి, టీ తాగేందుకు కనీసం వ్యవధి 2 గంటలు అయినా ఉండాలి. లేదంటే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. కనుక టీ తాగేవారు ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి. లేదంటే కోరి అనారోగ్యాలను తెచ్చుకున్నవారు అవుతారు.