Sabudana Dosa : దోశలను చాలా మంది తరచూ ఉదయం టిఫిన్ రూపంలో తింటుంటారు. దోశల్లో మనకు అనేక రకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో సగ్గుబియ్యం దోశ కూడా ఒకటి. సగ్గుబియ్యం వాస్తవానికి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తింటే శరీరానికి శక్తి లభించడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి చలువ చేస్తాయి. అయితే వీటితో దోశలను తయారు చేసి తినవచ్చు. వీటిని చేయడం ఎంతో సులభం. ఈ క్రమంలోనే సగ్గుబియ్యం దోశల తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – 1 కప్పు (నీటిలో రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి), శనగపిండి – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, సన్నగా తరిగిన అల్లం ముక్కలు – కొన్ని, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, పచ్చిమిర్చి – 3, జీలకర్ర – 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నూనె – అర కప్పు.
సగ్గు బియ్యం దోశలను తయారు చేసే విధానం..
సగ్గుబియ్యంలోని నీళ్లు వంపేయకుండానే శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర చల్లాలి. చుట్టూ నూనె వేసి మూత పెట్టేయాలి. 5 నిమిషాలకు ఇది కాలుతుంది. ఈ దోశ మెత్తగానే ఉంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కలిపి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.