Cucumber And Pineapple Drink : ఈ రోజుల్లో చాలా మంది స్కిన్ డల్‌గా ఉండాలని కోరుకోవడం లేదు. చర్మం కాంతివంతంగా మారి యంగ్‌గా ఉండాలనే ఆశిస్తున్నారు. అందుకోసమే రకరకాల స్కిన్ కేర్ రొటీన్లను ఫాలో అవుతుంటారు. మార్కెట్లో లభించే ఖరీదైన కాస్మొటిక్స్‌ను కొని వాడుతుంటారు. అయితే వాస్తవానికి వీటికన్నా కూడా నాచురల్‌గా పాటించే టిప్స్ అయితే ఎంతో మేలు. ఇవి మీ చర్మానికి హాని చేయకుండానే మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అయితే ఈ టిప్స్‌తోపాటు మనం ఒక డ్రింక్‌ను రోజూ తీసుకోవడం వల్ల కూడా మన చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీరు పైనాపిల్, కీరదోసతో జ్యూస్ తయారు చేసి రోజూ తీసుకుంటే మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కీరదోసలో చర్మాన్ని సంరక్షించే ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది మీ చర్మానికి తేమను అందిస్తుంది. దీంతో చర్మం మెరుస్తుంది. అలాగే కీరదోసలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. న్యూట్రిషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) చెబుతున్న ప్రకారం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే చర్మం డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక పైనాపిల్ కూడా మీ చర్మానికి అద్భుతాలు చేసి చూపిస్తుంది. పైనాపిల్‌లో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం ప్రకారం బ్రొమెలిన్ అనే ఎంజైమ్ శరీరంలో వాపులను తగ్గిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల పైనాపిల్‌ను మీరు రోజూ డైట్లో చేర్చుకుంటే మీ చర్మ కాంతి పెరుగుతుంది. మీ ముఖంలో సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.
ఇక పైనాపిల్, కీరదోసతో డ్రింక్ తయారు చేయడం చాలా సులభం. మీకు ఇందుకు కేవలం నాలుగు పదార్థాలు చాలు. అవేమిటంటే.. కీరదోస, పైనాపిల్, కొన్ని తాజా పుదీనా ఆకులు, నిమ్మరసం. వీటన్నింటినీ బ్లెండర్లో వేసి డ్రింక్ తయారు చేయాలి. అనంతరం నీళ్లను కలపాలి. ఈ డ్రింక్‌ను గ్లాసులో పోసేటప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. అనంతరం డ్రింక్ మీద పుదీనా ఆకులను చల్లి గార్నిష్ చేయాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కీరదోస, పైనాపిల్ డ్రింక్ రెడీ అవుతుంది. దీన్ని మీరు రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపించాలని కోరుకునే వారు ఈ డ్రింక్‌ను రోజూ తాగితే చక్కని ఫలితం ఉంటుంది.