Weight Loss Drinks : అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది ఖరీదైన వెయిట్ లాస్ చికిత్సలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సహజసిద్ధమైన డ్రింక్స్‌ను మీరు రోజూ తాగితే చాలు. దీంతో మీ శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇక ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు తగ్గేందుకు తప్పనిసరిగా రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం గ్రీన్ టీని తీసుకోవాలి. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరిగిపోతుంది. బరువు త్వరగా తగ్గుతారు. ఇక రాత్రి పూట కూడా పలు డ్రింక్స్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా వాము వేసి మరిగించిన నీళ్లు లేదా జీలకర్ర నీళ్లను రాత్రి పూట తాగితే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. వీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మరుసటి రోజు ఉదయం సుఖ విరేచనం అవుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. కనుక రాత్రి పూట ఈ రెండింటిలో ఏదైనా ఒక డ్రింక్‌ను తాగాల్సి ఉంటుంది.
నిమ్మకాయ నీళ్లను తాగవచ్చు..
ఇక రాత్రిపూట నిమ్మకాయ రసం కలిపిన గోరు వెచ్చని నీటిని కూడా నిద్రకు ముందు తాగవచ్చు. అధిక బరువును తగ్గించడంలో నిమ్మకాయ నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించగలవు. రాత్రి నిద్రకు ముందు తాగితే మంచిది. శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ, లివర్ శుభ్రంగా మారుతాయి.
అధిక బరువును తగ్గించేందుకు రాత్రి నిద్రకు ముందు కొత్తిమీర రసాన్ని కూడా తాగవచ్చు. దీన్ని 30 ఎంఎల్ మోతాదులో నీటిలో కలిపి తాగాలి. బరువును తగ్గించడంలో కొత్తిమీర కూడా బాగానే పనిచేస్తుంది. దీంతో మన శరీరానికి ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అయితే ఉదయం గ్రీన్ టీ తాగడంతోపాటు రాత్రి పూట నిద్రకు ముందు పైన చెప్పిన వాటిలో ఏదైనా ఒక డ్రింక్‌ను తాగాల్సి ఉంటుంది. దీంతో మెరుగైన ఫలితాన్ని రాబట్టవచ్చు. ఇందుకు గాను ఖరీదైన వెయిట్ లాస్ చికిత్సలు అసలు అవసరం లేదు. చాలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.