How To Clean Ceiling Fan : మన అందరి ఇళ్లలోనూ సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. సీజన్లతో సంబంధం లేకుండా మనం వీటిని రోజూ వాడుతూనే ఉంటాం. కేవలం వేసవిలో మాత్రమే కూలర్లు, ఏసీలను ఉపయోగిస్తాం. ఇక అన్ని రోజుల్లోనూ సీలింగ్ ఫ్యాన్స్ వాడకం తప్పనిసరి. కానీ ఈ ఫ్యాన్స్ ను వాడుతున్న కొద్దీ వాటిపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీంతోపాటు జిడ్డు లాంటి పదార్థం కూడా ఫ్యాన్ రెక్కలపై చేరుతుంది. అయితే చాలా మంది సీలింగ్ ఫ్యాన్లను తరచూ శుభ్రం చేయరు.
సీలింగ్ ఫ్యాన్స్‌ను శుభ్రం చేయకపోతే వాటి మీద ఉండే దుమ్ము, ధూళి, ఇతర వ్యర్థాలు ఉండలుగా పేరుకుపోయి ఇంట్లో ఫ్యాన్ తిరిగినప్పుడల్లా రూమ్ మొత్తం వెదజల్లబడతాయి. అందువల్ల సీలింగ్ ఫ్యాన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్స్‌ను కనీసం 3 నెలలకు ఒకసారి అయినా శుభ్రం చేయాలి. లేదా దుమ్ము బాగా పేరుకుపోయినప్పుడు అయినా సరే శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దుమ్ము చేరకుండా ఉంటుంది. పైగా రెక్కల నుంచి గాలి బాగా వస్తుంది. ఇక సీలింగ్ ఫ్యాన్‌ను క్లీన్ చేసే వారు ఈ టిప్స్ పాటిస్తే చాలా సులభంగా ఫ్యాన్స్‌ను క్లీన్ చేయవచ్చు.
వాక్యూమ్ క్లీనర్ వాడితే మంచిది..
సీలింగ్ ఫ్యాన్‌పై ఉండే దుమ్ము, ధూళిని ముందుగా వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేస్తే మంచిది. దీని వల్ల దుమ్ము లేవకుండా ఉంటుంది. ఫ్యాన్‌ను క్లీన్ చేసేందుకు ఏదైనా టేబుల్ లేదా చెయిర్, నిచ్చెన లాంటి ఫర్నిచర్ సహాయం తీసుకోవచ్చు. ఇక వాక్యూమ్ క్లీనర్ లేకపోతే ముందుగా ఏదైనా వస్త్రంతో దుమ్ము, ధూళిని పూర్తిగా తుడిచి దాన్ని ఒక కవర్‌లోకి సేకరించాలి. తరువాత ఒక తడి వస్త్రంతో ఫ్యాన్ రెక్కలను తుడవాలి.
సబ్బు నీళ్లలో వస్త్రాన్ని ముంచి తరువాత దాన్ని బయటకు తీసి పిండి దాంతో ఫ్యాన్ రెక్కలను తుడవాలి. దీంతో ఫ్యాన్ రెక్కలపై ఉండే జిడ్డు, మరకలు పోతాయి. ఫ్యాన్ రెక్కలపై ఎక్కువ తడి చేరకుండా చూడాలి. తరువాత ఒక శుభ్రమైన పొడి వస్త్రంతో మళ్లీ ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేయాలి. తరువాత కాసేపు అలాగే ఉంచి అప్పుడు ఫ్యాన్ ను ఆన్ చేసి ఉపయోగించవచ్చు. ఇలా సీలింగ్ ఫ్యాన్‌ను క్లీన్ చేయాల్సి ఉంటుంది. అయితే అన్ని స్టెప్స్ పూర్తయ్యాక సీలింగ్ ఫ్యాన్‌పై, రెక్కలపై ఫర్నిచర్ పాలిష్ లేదా ఫ్యాన్ బ్లేడ్ స్ప్రే చేయవచ్చు. దీంతో ఫ్యాన్‌పై ఎక్కువ కాలం పాటు దుమ్ము, ధూళి, జిడ్డు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంటాయి. ఇలా సీలింగ్ ఫ్యాన్స్ శుభ్రతను మెయింటెయిన్ చేయవచ్చు.