ప్రస్తుత తరుణంలో చాలామంది జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడం లేదని విచారిస్తున్నారు. అయితే చుండ్రు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలను తగ్గించేందుకు వేపాకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకుల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల వేపాకులను వాడితే చుండ్రు తగ్గుతుంది. దీంతోపాటు జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక వేపాకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు వేపాకులను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఐదు కప్పుల నీటిలో ఆ వేపాకులను వేసి బాగా మరిగించాలి. దీంతో నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. నీరు చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు ఆగి తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది. జుట్టు రారడం ఆగుతుంది. వేపాకులతో హెయిర్ ప్యాక్ ను కూడా వేసుకోవచ్చు. వేపాకులను కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. అనంతరం ఆ పేస్టుని జుట్టుకు బాగా పట్టించాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి.
వేపాకులను, ఉసిరికాయలను ఉపయోగించి కూడా ఒక చిట్కాను పాటించవచ్చు. అందుకు గాను మూడు స్పూన్ల ఉసిరికాయ పొడి, మూడు లేదా నాలుగు టీ స్పూన్ల వేపాకుల పొడి తీసుకొని నీటితో కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి 15 నుంచి 20 నిమిషాలు ఆగిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. మార్కెట్లో మనకు వేప నూనె లభిస్తుంది. వేప నూనెతో జుట్టును బాగా మర్దనా చేయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. శిరోజాలు ఒత్తుగా పొడవుగా పెరిగి కాంతివంతంగా మారుతాయి. జుట్టు ప్రకాశిస్తుంది.