తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలపై కొరటా ఝులిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశారు. హైడ్రా పేరిట ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అయితే హైడ్రా పెట్టడం మంచి ఉద్దేశమే అయినప్పటికీ బడాబాబులకు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు టైమ్ ఇస్తున్నారని, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు అసలు సమయం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై అటు ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇక దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
హైదరాబాద్ లో హైడ్రా పేరిట పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం సోదరులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా ? హైడ్రా పేరిట ఎక్కువగా పేదల ఇళ్లే కూలుస్తున్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి.. అని కేటీఆర్ అన్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో భారీ కుంభ కోణం జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. పాకిస్థాన్ కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారని, ఈ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు అవసరమా.. అని ఆయన ప్రశ్నించారు.