సాధారణంగా శనీశ్వరుని పేరు వినగానే ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు నవగ్రహాలకు పూజ చేయాలన్నా నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక ఎక్కడ తమకు శని ప్రభావం కలుగుతుందోనని నవగ్రహాలకు కూడా పూజలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తుంటారు. శని దేవుడు ప్రతి ఒక్కరినీ ఎన్నో కష్టాలకు గురి చేస్తాడనే సంగతి మనకు తెలిసిందే. కానీ శని దేవుడు ఎవరి కర్మకు తగ్గ ఫలితం వారికి ఇస్తూ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు.
ఈ విధమైనటువంటి శని ప్రభావం మనపై ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. శని బాధలు, శని దోషాలు తొలగిపోవాలంటే శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన పనులు చేయటం వల్ల శని బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శని దేవుడికి ఎంతో ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటి.
సాధారణంగా శనిని ఈశ్వరుడి అంశంగా భావిస్తారు. కనుక శని దేవుడిని శనీశ్వరుడు అని పిలుస్తారు. కనుక శని ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే తప్పకుండా శివుడికి నిత్యం అభిషేకం చేయటం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా శని దోషంతో బాధపడేవారు ప్రతి రోజూ నల్లని నువ్వులను అన్నంలో కలిపి కాకులకు పెట్టడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. అదేవిధంగా శనీశ్వరుడికి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించి నీలిరంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల శని దేవుడు ప్రీతి చెంది.. బాధలను తొలగిస్తాడని చెబుతున్నారు.