Kids : చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే. తన, పర అనే భేదం లేకుండా చిన్నారులు ఎవరి వద్ద ఉన్నా ఇతరులు వారిని ఆప్యాయంగా పలకరిస్తారు. వీలుంటే చేతుల్లోకి తీసుకుని ఆడిస్తారు. ఇది ఎక్కడైనా జరిగిదే. అయితే అలా ఆడించే సమయంలో కొందరు చిన్నారులను ఎత్తుకుని అటూ ఇటూ షేక్ చేసినట్టు ఊపుతారు. అలాగే పసికందులను గాలిలో ఎగరేస్తూ ఆడిస్తారు. అయితే.. నిజానికి చిన్నారులను అలా చేయవచ్చా..? చేస్తే ఏమవుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చిన్నారులకే కాదు, పెద్దలకు కూడా తలను అలా అటు, ఇటు లేదా కిందకు, పైకి ఆడిస్తే తల తిరుగుతుంది. కొందరికి ఇలా చేస్తే పడదు. వాంతులు కూడా అవుతాయి. అలాంటిది చిన్నారులకు ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారికి కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుందట. దీంతో వారు దాన్ని తట్టుకోలేకపోతారట. ఆ క్రమంలో వారి మెదడుకు షాక్ తగిలే అవకాశం ఉంటుందట. సాధారణంగా చిన్నారుల మెదడు ఇంకా పూర్తి స్థాయిలో ఎదగదు కనుక మెదడు అంతా ఇటు, ఇటు తిరుగుతుందట. దీంతో వారికి బ్రెయిన్ షాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుందట. ఈ స్థితిలో వారి మెదడులో రక్త స్రావం అయి మెదడు, వెన్నెముకకు నష్టం కలుగుతుందట.
ఈ క్రమంలో బ్రెయిన్ షాక్ వచ్చిన చిన్నారులు ఒక్క సారిగా స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారట. అప్పుడు వారు చూడలేరు, మాట్లాడలేరు, నడవలేరట. దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట. అయితే అంతటి ప్రాణాపాయ స్థితికి చేరుకోకున్నప్పటికీ చాలా మంది పిల్లలను ఇలా చేయడం వల్ల వారు సరిగ్గా ఎదగరట. అవయవాలు సరిగ్గా ఎదగవని సాక్షాత్తూ సైంటిస్టులు చేసిన పరిశోధనలే చెబుతున్నాయి. కనుక ఎవరైనా పిల్లలను దగ్గరకు తీసుకుంటే ఆడించండి. ముద్దు చేయండి. అంతేకానీ గాల్లోకి ఎగరేయడం, అటు, ఇటు ఊపడం వంటివి అస్సలు చేయరాదు. చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చినవారవుతారు.