ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కేరళలో మాత్రం రోజు రోజుకీ కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు మళ్లీ నిపా వైరస్ కేసులు నమోదవుతుండడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. అయితే నిపా వైరస్, కరోనా వైరస్.. రెండింటి మధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిపా వైరస్ మొదటగా 1999లో గుర్తించబడింది. మలేషియాలోని సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్‌ను మొదట గుర్తించారు. దీంతో ఆ ఊరి పేరిటే ఈ వైరస్‌కు నిపా వైరస్ అని పేరు పెట్టారు. ఈ వైరస్ పందులు, గబ్బిలాలు, కుక్కలు, మేకలు, పిల్లులు, గుర్రాలు, గొర్రెల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మన దేశంలో కేరళలో అప్పుడప్పుడు నిపా వైరస్ కేసులు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ వైరస్‌ను కట్టడి చేస్తున్నారు.
అయితే కోవిడ్‌తో పోలిస్తే నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ రేటు తక్కువే. ఇది తక్కువగా వ్యాప్తి చెందుతుంది. కానీ వ్యాప్తి చెందితే మాత్రం ప్రాణాంతకం అయ్యే అవకాశాలే ఎక్కువే. ఈ వైరస్ సోకిన వారు చనిపోయే అవకాశాలు 70 శాతం వరకు ఉంటాయి. కరోనా లాగే ఈ వైరస్‌కు ప్రత్యేకంగా మందులు అంటూ ఏమీ లేవు. కరోనా వైరస్‌కు ఇచ్చిన చికిత్సనే ఈ వైరస్‌కు ఇస్తారు. కానీ నిపా వైరస్ సోకితే ప్రాణాంతకం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
ఇక కోవిడ్ ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువ. కానీ నిపాతో పోలిస్తే కోవిడ్ ప్రాణాంతకం కాదు. 1-2 శాతం మందికి కోవిడ్ ప్రాణాంతం అవుతుంది. నిపా వైరస్ 70-80 శాతం మందికి ప్రాణాంతకం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే చాలు, నిపా ఎంత ప్రాణాంతకమో అర్థమవుతుంది.
ఇక కోవిడ్ వచ్చిన వారిలో కామన్ గా అందరికీ జ్వరం, పొడి దగ్గు, అలసట, నొప్పులు, రుచి, వాసన శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపా వైరస్ వ్యాప్తి చెందిన వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు కావడం, గొంతు నొప్పి, తల తిరగడం, మత్తుగా ఉండడం, స్పృహ తప్పి పడిపోవడం, నాడీ సంబంధ సమస్యలు వస్తాయి. ఈ విధంగా కోవిడ్, నిపా లక్షణాలను గుర్తించవచ్చు.
కోవిడ్, నిపా వైరస్ ను నిర్దారించేందుకు రెండింటికీ ఒకే రకమైన ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తారు. గొంతు, ముక్కు ద్వారా శాంపిల్స్ సేకరించి పరీక్ష నిర్వహిస్తారు. అయితే నిపా వైరస్‌ను ఎప్పుడో గుర్తించినప్పటికీ ఇప్పటికీ దానికి వ్యాక్సిన్‌ను తయారు చేయలేదు. ఇది కోవిడ్ తో పోలిస్తే అంత ఎక్కువగా వ్యాప్తి చెందదు. అయినప్పటికీ కోవిడ్ కన్నా ప్రాణాంతకం కనుక ప్రస్తుతం నిపా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.