Suman : కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. సుమన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై స్టార్ హీరోగా ఎదిగారు. చూడచక్కని రూపం.. ఆరడుగుల అందగాడు.. అచ్చ తెలుగు అబ్బాయిలా ఉండే సుమన్ కి అప్పట్లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. హీరో, సహాయ నటుడు, విలన్ ఇలా ఏ పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి నటించే అరుదైన నటులలో సుమన్ ఒకరు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో నటించిన సుమన్ తర్వాత కొంతకాలం కొన్ని కారణాల వలన సినిమాలకు దూరం అయ్యారు.
ఆయనకు కెరియర్లో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలు చాలానే ఉన్నాయి. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి, రామదాసు సినిమాలో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు సుమన్. 1980 దశాబ్దంలో సుమన్ టాలీవుడ్ లో చిరంజీవికి పోటీ ఇచ్చారు అంటే ఆయన రేంజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ సినిమాలతోపాటు కుటుంబ కథా చిత్రాలతో సుమన్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. తరంగిణి సినిమాతో తెలుగులో అడుగుపెట్టి నటనపరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా మంచి స్థాయిలో ఉన్న టైంలో కొన్ని కారణాల వల్ల ఆయన జైలుకు వెళ్లవలసి వచ్చింది.
సుమన్ జైలు జీవితం గడపడం వెనక ఓ రాజకీయ కుట్ర ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో ద్వారా తెలిపారు. రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన సుమన్ మానసికంగా కుంగిపోయారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. సుమన్ జైలు జీవితం గడిపిన తరవాత కూడా టాలీవుడ్ లెజండరీ రైటర్ బసవరాజు తన మనవరాలు శిరీషను ఇచ్చి వివాహం జరిపించారు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుమన్ నిర్దోషి కాబట్టే బసవరాజు తన మనవరాలు శిరీషతో వివాహం జరిపించారని అంతా అనుకున్నారు.
పెళ్లి తరువాత సుమన్ జీవితం మళ్లీ దారిలోకి వచ్చింది. పెళ్లి తరువాత సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బావబావమరిది, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, పెద్దింటి అల్లుడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూ ద్వారా సుమన్ తన భార్య చాలా మంచిదని, ఆమె వల్లే మరలా తిరిగి సినిమా ఇండస్ట్రీలో పోయిన తన గౌరవాన్ని తిరిగి దక్కించుకున్నానని సుమన్ తెలియజేశారు.