బల్లిని చూస్తేనే చాలా మందికి శరీరంపై ఏదో పాకినట్లు జలదరింపు వస్తుంది. కొందరైతే బల్లిని చూస్తే ఆమడ దూరం పారిపోతారు. అయితే మనం వండే ఆహారాల్లో అప్పుడప్పుడు బల్లి పడడం జరుగుతుంది. దాన్ని గమనించి చూస్తే ఓకే. లేదంటే అలాంటి ఆహారాన్ని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఆహారంలో బల్లి పడితే అది నిజంగానే విషంలా మారుతుందా ? అంటే..
మన ఇళ్లలో, చుట్టూ పరిసరాల్లో మనకు కనిపించే బల్లులు చాలా వరకు విష రహితమైనవి. అంటే వాటిల్లో విషం ఉండదు. వాటి వల్ల ఎలాంటి హాని కలగదు. కానీ వాటికి ఎల్లప్పుడూ ప్రమాదకమైన బాక్టీరియా, వైరస్‌లు అంటి పెట్టుకుని ఉంటాయి. ఈ క్రమంలో బల్లులు ఆహారంలో పడితే ఆ ఆహారం నిజంగానే విషతుల్యం అవుతుంది.
బల్లులపై ఉండే సూక్ష్మ జీవులను బట్టి ఆహారం విషంగా మారుతుంది. కొన్నింటికి పెద్దగా సూక్ష్మ జీవులు ఉండకపోవచ్చు. కానీ బల్లులపై సూక్ష్మ జీవులు ఉంటే మాత్రం.. అవి ఆహారాల్లో పడితే ఆ ఆహారం విషంగా మారుతుంది. అలాంటి ఆహారాన్ని తింటే మనకు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు సంభవిస్తాయి. కొందరికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. అందువల్ల బల్లి పడిన ఆహారాలను అస్సలు తినకూడదు. బల్లులు స్వతహాగా హానికరమైనవి కాకపోయినా.. వాటిపై ఉండే సూక్ష్మ జీవుల వల్ల అవి పడే ఆహారాలు విషతుల్యం అవుతాయి. కనుక బల్లి పడిన ఆహారాన్ని పడేయాలి. తినకూడదు.