Egg Dum Biryani : బిర్యానీ.. ఈ పదం వినని వాళ్లు, దీని రుచి చూడని వారు ఎవరూ ఉండరు.. అంటే అది అతిశయోక్తి కాదు. బిర్యానీని మనం ఎక్కువగా హోటల్స్‌లో తింటూ ఉంటాం. ఇది మనకు అనేక రుచులల్లో దొరుకుతుంది. అందులో ఎగ్ దమ్ బిర్యానీ ఒకటి. హోటల్స్ లో ఉండే రుచిలా ఇంట్లో నే మనం ఎగ్ దమ్ బిర్యానీని చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఎగ్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలను, తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం -అర కిలో, ఎగ్స్ – 4 , అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, వేయించిన ఉల్లి పాయలు – ఒక కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తి మీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నూనె – 4 టీ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, యాలకులు – 4, లవంగాలు – 5, దాల్చిన చెక్క – కొద్దిగా, సాజీరా – ఒక టీ స్పూన్.
బిర్యానీ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
బిర్యానీ ఆకులు -4, ఎండు మిరపకాయలు – 4, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, జాపత్రి – 3, దాల్చిన చెక్క – 2 లేదా 3, లవంగాలు – 5, యాలకుల- 5, జాజి కాయ – 1 , మరాఠీ మొగ్గ- 2, అనాస పువ్వు – 3.
ఎగ్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని గంట సేపు నానబెట్టాలి. ఎగ్స్ ను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో బిర్యానీ మసాలాకు కావల్సిన పదార్థాలన్నింటినీ వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పదార్థాలను ఒక జార్‌లో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం, బియ్యానికి సరిపడా నీళ్లు, కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు, యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసి 80 శాతం వరకు బియ్యాన్ని ఉడికించి, ఎక్కువగా ఉన్న నీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకపెద్ద కళాయి లేదా బిర్యానీకి సరిపడా గిన్నె ను తీసుకుని అందులో నూనె వేసి కాగాక కారం, పసుపు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి వేయించుకోవాలి.
ఎగ్స్ వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయి లేదా పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, అర కప్పు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని వేయించుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తి మీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో సగం మిశ్రమాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో సగం అన్నాన్ని కళాయిలో మిగిలిన మిశ్రమంపై సమానంగా వేసుకోవాలి.
ఇలా వేసుకున్న అన్నంపై మిగిలిన మిశ్రమాన్ని, ఎగ్స్ ను, కొద్దిగా వేయించిన ఉల్లిపాయలను సమానంగా వేసుకోవాలి. ఈ ఎగ్స్ పై మిగిలిన అన్నాన్ని సమానంగా వేసిన తరువాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా వేయించిన ఉల్లిపాయలను వేయాలి. ఇప్పుడు అన్నంపై కొద్దిగా నీటిని చల్లి, మూత పెట్టి చిన్న మంటపై అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని మిర్చి కా సాలన్ లేదా పెరుగు చట్నీ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.