Fast Brain : మనిషై పుట్టాక వయస్సు పెరుగుతున్నకొద్దీ ఎవరైనా వృద్ధులు కావల్సిందే. కాకపోతే కొందరు క్రీములు గట్రా రాయడం, వివిధ రకాల పద్ధతులను పాటించడం వంటి కారణాల వల్ల కొంత ఆలస్యంగా వృద్ధులుగా కనిపిస్తారు. కానీ వారి శరీరంలోని అవయవాలన్నీ వృద్ధాప్యం బారిన ఎప్పుడో పడే ఉంటాయి. అయితే మీకు తెలుసా..? ఏ అవయవం వృద్ధాప్యం బారిన పడినా కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే మెదడును మాత్రం ఎల్లప్పుడూ యంగ్‌గానే ఉంచుకోవచ్చట. దీంతో శరీరం కూడా యంగ్‌గా ఉత్సాహంగా ఉంటుదట. ఈ క్రమంలో మెదడును ఎల్లప్పుడూ యంగ్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గణిత శాస్త్ర సంబంధ సమస్యలను పరిష్కరించడం, పజిల్స్ పూర్తి చేయడం, ఇతర మెదడుకు మేత సంబంధ సమస్యలను సాల్వ్ చేయడం, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి యాక్టివిటీలలో తరచూ పాల్గొనడం ద్వారా మెదడును ఎల్లప్పుడూ యంగ్‌గా ఉంచుకోవచ్చు. నిత్యం వీలైనంత సమయం పాటు వ్యాయామం చేయాలి. దీంతో మెదడుకు రక్తం సరఫరా పెరిగి అది యాక్టివేట్ అవుతుంది. అది మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది. యంగ్‌గా ఉండేలా చేస్తుంది. నిత్యం శరీరానికి కావల్సిన క్యాలరీల కన్నా కొంచెం తక్కువగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటే తద్వారా మెదడు ఎక్కువగా పనిచేస్తుందట. దీంతోనూ మెదడును యంగ్‌గా ఉంచుకోవచ్చట.
బీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. దీని వల్ల కూడా మెదడు పనితనం పెరుగుతుంది. డయాబెటిస్ వ్యాధి రాకుండా, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. ఇది కూడా మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మద్యపానం, ధూమపానం మానేయాలి. ఇవి మెదడును మొద్దుబారిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మెదడు షార్ప్ అవుతుంది. ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళన, టెన్షన్, ఒత్తిడి వంటి వాటిని దూరంగా తరిమికొట్టాలి. లేదంటే మెదడుపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అది మెదడు పనితనాన్ని దెబ్బ తీస్తుంది.
నిత్యం శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరమే. సరిగ్గా నిద్రపోతే మెదడు షార్ప్‌గా మారుతుంది. తలకు ఎలాంటి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ప్రధానంగా వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ వంటి వాటిని ధరించాలి. తలకు దెబ్బలు తగిలినా మెదడు పనితీరులో మార్పు వస్తుంది. నలుగురిలోనూ కలసి తిరగడం అలవాటు చేసుకోవాలి. నిత్యం కొత్త వ్యక్తులను కలిసేందుకు ప్రయత్నించాలి. దీంతో మెదడు ఉత్తేజమవుతుంది.