గత కొంత కాలంగా నటుడు మోహన్ బాబు కుటుంబంలో అనేక గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో మంచు విష్ణు తన సోదరుడు మంచు మనోజ్ ఇంటికి వెళ్లి పనివారిపై చేయి చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ముల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నట్లు ప్రజలకు అర్థమైంది. అయితే అంతా సద్దుమణిగింది అనుకున్న లోపే తాజాగా జరిగిన సంఘటనలు మళ్లీ వారి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నట్లు నిరూపిస్తున్నాయి. తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు తన కుమారుడు మనోజ్‌పై ఫిర్యాదు చేయడం, మనోజ్ కూడా తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో మరోసారి మంచు కుటుంబం వార్తల్లోకి ఎక్కింది.
అయితే సెలబ్రిటీల ఇళ్లలో జరిగే సంఘటనలపై ప్రజలు కూడా ఆసక్తిని చూపిస్తుంటారు కనుక మీడియా కూడా ఈ విషయంలో కాస్త అత్యుత్సాహం కనబరిచింది. దీంతో జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఓ టీవీ చానల్‌కు చెందిన జర్నలిస్టుపై మైక్‌తో దాడి చేయడం వల్ల ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు మంచు కుటుంబంలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయని చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ గొడవలకు ప్రధాన కారణం ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాలే అని తెలుస్తోంది.
మంచు విష్ణు ప్రస్తుతం మోహన్ బాబుకు చెందిన కాలేజీలు, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, స్కూల్స్ తదితర వ్యాపారాలకు సంబంధించిన కార్యకలాపాలను చూస్తున్నారు. కానీ మనోజ్‌కు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. పైగా మనోజ్ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు అసలు ఇష్టం లేదట. దీంతోపాటు మంచు మనోజ్ చివరిగా తన సొంత నిర్మాణంలో అహం బ్రహ్మస్మి అనే సినిమా చేశాడు. ఆ మూవీ చేయడం కూడా మోహన్ బాబుకు ఇష్టం లేదట. తనకు ఇష్టం లేని పనులు చేస్తున్నందునే మనోజ్‌ను కాదని విష్ణుకు తన వ్యాపార కార్యకలాపాలను అప్పగించారట మోహన్ బాబు. దీంతో ఆవేదనకు గురైన మనోజ్ తండ్రి, సోదరులతో నిరంతరం గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. అందుకనే తాజాగా కూడా గొడవలు జరిగాయని సమాచారం.
ఇక మోహన్ బాబు ఆస్తుల విషయానికి వస్తే ఆయనకు సుమారుగా రూ.500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఆయనకు పలు స్కూల్స్, కాలేజీలతోపాటు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో భక్త కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి ఇతర భాషలకు చెందిన వారు కూడా యాక్ట్ చేస్తున్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే ఈ గొడవలు జరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.