టీ20 వరల్డ్ కప్ జరిగిన తరువాత నుంచి భారత క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ నేతృత్వంలో టీమిండియా విజయాల పరంపర ఉంటుందని అంతా భావించారు. కానీ కట్ చేస్తే అనేక సిరీస్‌లలో ఇంటా, బయటా ఓడుతూ చెత్త ప్రదర్శనను, రికార్డులను మూటగట్టుకుంటోంది. ఒక టీ20లు తప్ప వన్డేలు, టెస్టుల్లో పేలవమైన ఆటతీరును కనబరుస్తున్నారు. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్, ఫీల్డింగ్ లో విఫలమవుతున్నారు. దీంతో టీమిండియా ఆటతీరుపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కోచ్ గంభీర్ బాధ్యత వహించాలంటే, కాదు.. రోహిత్ శర్మనే బాధ్యత తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 2 మ్యాచ్‌లలో గెలవాల్సింది పోయి ఓడిపోయింది. దీంతో 3-0 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకు ముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. అలాగే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ బౌలర్లు ఫర్వాలేదనిపించినా బ్యాట్స్ మెన్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. అయితే సమస్య ఎక్కడ వస్తుందన్నది అర్థం కాని విషయంగా మారింది.
ఓవైపు టీ20లకు కోహ్లి, రోహిత్, జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ టెస్టులు, వన్డేల్లోనూ వీరు రాణించలేకపోతున్నారు. మరోవైపు గంభీర్ ఈ మధ్యనే కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే వచ్చే చాంపియన్స్ ట్రోఫీనే ఈ ముగ్గురికీ ఆఖరు అని గంభీర్ చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అందువల్లనే ఈ ముగ్గురూ సరైన ప్రదర్శన చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియాతో మిగిలిన టెస్టుల్లో వీరి ప్రదర్శన ఎలా ఉంటుంది, టీమిండియా పోయిన పరువును మళ్లీ రాబట్టుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.