నేటి తరుణంలో ఆరోగ్యం పట్ల చాలా మంది శ్రద్ధ వహిస్తున్నారు. అందుకనే రోజూ వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, డైట్ పాటించడం.. వంటి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాయామం విషయానికి వస్తే.. అందరూ పాటించగలిగే చాలా తేలికమైన వ్యాయామం.. వాకింగ్ అని చెప్పవచ్చు. ఇందుకు గాను ఎవరూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. జిమ్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇంటి దగ్గరే వాకింగ్ చేయవచ్చు.
అయితే వాకింగ్ విషయానికి వస్తే చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి ? ఎంత సేపు నడవాలి ? అని పలువురికి అనుమానాలు వస్తుంటాయి. అయితే నిజానికి ఈ రెండు ప్రశ్నలకన్నా.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి ? అని డౌట్ వస్తేనే బెటర్. ఎందుకంటే.. నిత్యం నిర్దిష్టమైన సంఖ్యలో సూచించిన విధంగా అడుగులు నడిస్తే చాలు.. కిలోమీటర్లు, టైంతో పని ఉండదు. నిత్యం మనం కనీసం 5వేల అడుగులు నడిస్తే మంచిది. కుదిరితే 10వేల అడుగులు కూడా నడవచ్చు.
కానీ మరి.. కిలోమీటర్లనే కొలవలేం.. ఇంక అడుగులను ఎలా కొలుస్తాం.. అంటారా.. అందుకు దిగులు చెందకండి. మీ స్మార్ట్‌ఫోన్ లోనే పెడోమీటర్ యాప్స్ వేసుకుని వాటిని మీరు వాకింగ్ చేసేటప్పుడు ఆన్ చేస్తే చాలు. మీరు ఎన్ని అడుగులు నడిచారో అదే తెరపై చూపిస్తుంది. లేదంటే ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌బ్యాండ్లు, స్మార్ట్‌వాచ్‌లు కూడా వాడవచ్చు. కానీ అది ఖర్చుతో కూడిన వ్యవహారం. అవి కుదరదనుకుంటే.. ఫోన్‌లోనే పెడోమీటర్ యాప్ వేసి వాడితే.. నిత్యం మీరు ఎన్ని అడుగుల దూరం నడుస్తున్నారో చాలా సులభంగా తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే నిత్యం 5వేలు లేదా 10వేల అడుగుల దూరం నడిచేలా ప్లాన్ చేసుకోండి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు..!