ఉరుకుల పరుగుల బిజీ జీవితం.. ఒత్తిళ్లు.. మానసిక ఆందోళన.. అస్తవ్యస్తమైన జీవన విధానం.. వ్యాయామం చేయకపోవడం.. అధిక బరువు.. డయాబెటిస్.. తదితర అనేక కారణాల వల్ల ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఏటా గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. అయితే కేవలం పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. గుండె జబ్బులు వచ్చేందుకు మరొక కారణం కూడా ఉంది. అదే నిద్ర.. నిద్ర తగ్గడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
రోజుకు 6 గంటల కన్నా తక్కువ సమయం పాటు నిద్రించే పురుషులకు అథెరోస్లెరోసిస్ అనే వ్యాధి వస్తుందట. అలాగే నిత్యం 8 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు నిద్రించే మహిళలకు కూడా ఈ వ్యాధి వస్తుందని సైంటిస్టులు తేల్చారు. అథెరోస్లెరోసిస్ అంటే.. గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి వచ్చిన వారికి హార్ట్ ఎటాక్‌లు, ఇతర గుండె జబ్బులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
ఇక నిత్యం 7 నుంచి 8 గంటల పాటు నిద్రించే వారితో పోలిస్తే 6 గంటల కన్నా తక్కువ సమయం పాటు నిద్రించే వారికి పైన చెప్పిన అథెరోస్లెరోసిస్ వచ్చేందుకు 27 శాతం అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. అందుకని ఎవరైనా సరే.. నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రపోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. లేదంటే అథెరోస్లెరోసిస్‌తోపాటు గుండె జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు టైముకు నిద్రించండి.. ఆరోగ్యంగా ఉండండి..!