రోజుకో యాపిల్ పండు తింటే చాలా మంచిదని మనకు వైద్యులు చెబుతుంటారు. నిజానికి యాపిల్స్ మాత్రమే కాదు, అరటి పండ్లను కూడా రోజూ తినాల్సిందే. రోజుకో అరటి పండును తింటే మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండులో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పొటాషియం, విటమిన్ బి6, సి, మెగ్నిషియం తదితర పోషకాలు ఉంటాయి. అందువల్ల అనారోగ్య సమస్యలు ఉన్నవారు రోజుకో అరటి పండును తింటే చాలు.. ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
గర్భిణీలకు…
గర్భిణీలు రోజూ అరటి పండ్లను కచ్చితంగా తినాలి. దాంతో వాటిలో ఉండే విటమిన్ బి6 బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు లివర్, కిడ్నీలలో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ఆస్తమాకు…
ఆస్తమా ఉన్నవారు రోజుకో అరటి పండును తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్, పొటాషియం బీపీని తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చూస్తాయి.
చర్మానికి…
చర్మ సమస్యలు ఉన్నవారు నిత్యం అరటి పండ్లను తింటే మార్పు ఉంటుంది. అరటి పండ్లలో ఉండే మాంగనీస్ చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
అధిక బరువుకు…
అరటి పండ్లను తింటే బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఎందుకంటే అరటి పండ్లలో కొవ్వు పదార్థం ఉండదు. పైగా క్యాలరీలు కూడా తక్కువగా లభిస్తాయి. కనుక అరటి పండ్లను తింటే చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు.
కిడ్నీల ఆరోగ్యానికి…
కిడ్నీ జబ్బులు ఉన్నవారు అరటి పండ్లను తింటే ఆ జబ్బుల కారణంగా వచ్చే సమస్యల నుంచి బయట పడవచ్చు. అరటి పండ్లలో ఉండే పొటాషియం కిడ్నీల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. నిత్యం ఒక అరటి పండును తింటే కిడ్నీల జబ్బులు వచ్చేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు చెబుతున్నాయి. కనుక నిత్యం ఒక అరటి పండును తినడం వల్ల పైన చెప్పిన అన్ని లాభాలను పొందవచ్చు.