నా పేరు పరమేష్, నాకు చిన్నప్పటి నుండి స్టడీస్ అంటే చాలా ఇష్టం, చదువే నా ప్రపంచం అనుకుంటూ పెరిగాను, ఇంటర్ వరకు నా జీవితం హాయిగా సాగిపోయింది. బాగా చదివేవాడిని కాబట్టి ఇంట్లో నన్ను ఎవరు తిట్టేవారు కాదు, చుట్టు పక్కల వారు కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక మంచి జాబ్ సంపాదించగలను అనే నమ్మకం వచ్చింది. రెండో సంవత్సరం పూర్తయ్యాక ఆ నమ్మకం మరింత పెరిగింది.
చిన్నప్పటి నుండి చదువుకి దగ్గరగా, అమ్మాయిలకు దూరంగా పెరిగాను. ఇంజనీరింగ్ చేసిన రెండు సంవత్సరాల్లో కూడా ఏ అమ్మాయితోనూ పరిచయం పెట్టుకోలేదు. ఇంకో రెండేళ్లు ఇలాగే కష్ట పడితే జీవితం సెటిల్ అయిపోద్ది అని డిసైడ్ అయ్యా. అప్పుడు వచ్చింది నా జీవితం లోకి ఒక అమ్మాయి. మా మామయ్య కూతురు కూడా నేను చదివే కాలేజీ లోనే జాయిన్ అయ్యింది. నేను బి.టెక్ మూడో సంవత్సరం లో చదువుతున్నప్పుడు తను మా కాలేజీ లో జాయిన్ అయ్యింది. తను బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతుంది.
మామయ్య కూతురు కావడం తో తన వెన్నంటే ఉండి స్టడీస్ లో కానీ, కాలేజీ లో కానీ తనకి ప్రాబ్లమ్ రాకుండా చూసుకున్నా. తనకి నా మీద ఎప్పుటినుండి ఇష్టం ఉందో తెలియదు, ఒక రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నా బావ అని చెప్పింది, తను నాకు ప్రొపోజ్ చేసిన సమయం లో నేను బి.టెక్ 4వ సంవత్సరం చదువుతున్నా, ఆ టైం కి మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొదలవటం తో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశం తో తన ప్రపోసల్ ని అప్పుడు ఒప్పుకోలేదు. నాకు కూడా తనంటే చాలా ఇష్టం, కానీ మంచి ఉద్యోగం వచ్చాక ఏకంగా తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని తనతో కావాలనే అన్నాను, నేను చెప్పిన మాటలను తను సీరియస్ గా తీసుకుంది, కొన్ని రోజుల తరువాత ఆ బాధలో తను విషం తాగింది.
తను విషం తాగిందని తెలియడంతో ఒక్క సారిగా నేను స్తంభించి పోయా, కొన ఊపిరితో ఉన్న తనను హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు, తను చనిపోతే నేను కూడా చనిపోదాం అని నిర్ణయించుకున్నా, కానీ అదృష్టవశాత్తు బ్రతికింది. తను కళ్ళు తెరిచిన వెంటనే తన మెడలో హాస్పిటల్ లోనే తాళి కట్టాను అందరి సమక్షం లో, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ ఉద్యోగం వస్తే ఇలా హాస్పిటల్ లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసుంటే నేనే నీకు ఎప్పుడో ప్రొపోజ్ చేసేవాడిని అని తనతో చెప్పా. ఆ నిమిషం తన కళ్ళల్లో ఆనందం చూసాక నా మనసులో ఏదో తెలియని సంతోషం, కొత్తగా జన్మించినట్టు అనిపించింది. నాకు ఆ రోజు కలిగిన సంతోషం నేను ఎన్ని మంచి మార్కులు తెచ్చుకున్నా, పెద్ద ఉద్యోగం చేసినా నాకు కలగలేదు. బహుశా ప్రేమంటే అంతేనేమో.