నేటి తరుణంలో మహిళలు తమ అందానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రధానంగా శిరోజాలను ఆకర్షణీయంగా కనబడేలా చేసుకునేందుకు, వాటిని బాగా పెంచుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మహిళలే కాదు, చాలా మంది పురుషులు కూడా జుట్టును ఎక్కువగా పెంచుకుని దాంతో స్టైల్ చేయించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కాలుష్యం, మానసిక ఒత్తిడి, దీర్ఘ కాలిక వ్యాధులు వంటి వాటి కారణంగా శిరోజాలను ఎక్కువగా కోల్పోతున్నారు. అయితే అలా వెంట్రుకలు రాలకుండా ఉండాలన్నా, బాగా ఒత్తుగా పెరగాలన్నా అందుకు కింద ఇచ్చిన పలు పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో కొద్ది రోజుల్లోనే శిరోజాల పెరుగుదలలో మార్పును గమనించవచ్చు.
వెంట్రుకలు ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేసే సహజ సిద్ధమైన ఆయిల్ సెబమ్‌ను విడుదల చేసేందుకు విటమిన్ ఎ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వెంట్రుకలు పొడిగా మారకుండా చూస్తుంది. క్యారెట్స్, కోడిగుడ్లు, పాలు, పాలకూర వంటి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల విటమిన్ ఎ లభించి తద్వారా శిరోజాలకు పోషణ కలుగుతుంది. జుట్టు పెరుగుదలకు బయోటిన్ ఎంతగానో అవసరం. ఇది కోడిగుడ్లు, పీనట్ బటర్, అరటిపండ్లు, బాదం పప్పులలో సమృద్ధిగా లభిస్తుంది. వెంట్రుకలు ఒత్తుగా దృఢంగా పెరగాలన్నా, కాంతివంతంగా మారాలన్నా విటమిన్ బి12 ఉన్న ఆహారం తీసుకోవాలి. అది ఎక్కువగా కోడిగుడ్లు, చీజ్, పాలు వంటి ఆహార పదార్థాల్లో లభిస్తుంది.
వెంట్రుకలు తెల్లబడడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఉంటే విటమిన్ సి ఉన్న ఆహారం తినాలి. ఇది ఎక్కువగా నిమ్మ, నిమ్మ జాతి పండ్లు, ఉసిరి, కివీలు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి వాటిలో లభిస్తుంది. జుట్టు కుదుళ్ల దృఢంగా ఉండాలంటే విటమిన్ ఇ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది బాదంపప్పు, చేపలు, వేరుశెనగ పప్పు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ ఎంతగానో దోహదపడుతుంది. ఇది ధాన్యపు గింజల్లో ఎక్కువగా ఉంటుంది. వెంట్రుకలు వేగంగా పెరగాలన్నా, వాటికి కాంతి చేకూరాలన్నా నియాసిన్ ఉన్న ఆహారం తినాలి. ఇది చికెన్ బ్రెస్ట్, ట్యూనా ఫిష్, పుట్ట గొడుగులు వంటి వాటిలో లభిస్తుంది. వెంట్రుకలను దృఢంగా ఉంచడంలో ఐరన్ ఉపయోగపడుతుంది. ఇది మాంసం, యాప్రికాట్స్, పాలకూర, కోడిగుడ్లలో ఉంటుంది.
వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నాయంటే జింక్ లోపమని తెలుసుకోవాలి. ఈ క్రమంలో అలాంటి వారు ఆయిస్టర్స్, నట్స్, కోడిగుడ్లు, చిలగడదుంపలు ఎక్కువగా తినాలి. వెంట్రుకల పెరుగుదలకు మెగ్నిషియం తోడ్పడుతుంది. ఇది నట్స్, చేపల్లో లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతగానో అవసరం. ఇవి పప్పులు, మాంసం, గుడ్లు వంటి వాటిలో లభ్యమవుతాయి. చేపలు, కాడ్ లివర్ ఆయిల్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి తింటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి.