ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ చాలా మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అడవుల్లో ఎక్కువగా పాము కాటు బారిన పడుతున్నారు. దీంతో వారికి సరైన టైములో వైద్యం అందడం లేదు. ఫలితంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే పాము ఉందని తెలియక చాలా మంది అవి ఉన్న చోటులోనే ఉంటారు. అవి అకస్మాత్తుగా కాటు వేస్తాయి. దీంతో నిమిషాల్లోనే శరీరంలో విషం అంతా పాకిపోతుంది. అది ప్రాణాలను తీస్తుంది. కానీ పాము మనల్ని కాటు వేసేముందు దాని ప్రవర్తనను బట్టి అది కాటు వేస్తుందా, లేదా అన్న విషయాన్ని గుర్తు పట్టవచ్చట.
ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ స్స్ స్స్.. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేయడం వంటివి చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని ధర్మేంద్ర త్రివేది అనే నిపుణుడు అన్నారు.
కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయి.. అని ఆయన అన్నారు.