Mustard Oil : ప్రస్తుత తరుణంలో మనకు అనేక రకాల నూనెలు వంట చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ నూనెను వంట చేసేందుకు ఉపయోగించాలో తెలియడం లేదు. కానీ వంట చేసేందుకు ఆవ నూనె ఉత్తమమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆవ నూనెను వంటకు ఉపయోగించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చని, అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆవ నూనెను వంటకు ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రతి నూనెకు గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. ఆవనూనెకు 249 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే.. అంత వరకు నూనెను వేడి చేసినా ఏమీ కాదన్నమాట. ఆపైన ఇంకా వేడి చేస్తే అందులో హానికర వ్యర్థాలు తయారవుతాయి. ఆవనూనె గరిష్ట వేడి చేసే ఉష్ణోగ్రత సహజంగానే ఎక్కువ కనుక.. దాన్ని మనం ఎంత వేడి చేసినా ఏమీ కాదన్నమాట. అందులో హానికర వ్యర్థాలు ఉత్పత్తి కావు. అందువల్ల అది ఆరోగ్యకరమైనదని స్పష్టమవుతుంది.
2. ఆవనూనెలో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
3. ఆవ నూనెలో ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి కనుక బరువు తగ్గేందుకు, శక్తికి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గుతారు.
4. ఆవనూనెలో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఉంటాయి. ఈ నూనెలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లుగా మారుతుంది. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. క్యాన్సర్ కణాలు పెరగవు.
5. ఆవనూనెలో ఆలైల్ ఐసోథయోసయనేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పులను తగ్గిస్తుంది. గాయాలను త్వరగా మానుస్తుంది.
6. ఆవనూనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. కాబట్టి ఎలా చూసినా ఆవనూనె మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.