ఫోటోగ్రాఫర్ ఆతిఫ్ సయీద్ ఈ సింహాన్ని ఫోటో తీయబోతున్నప్పుడు అది దాడి చేసింది. ఆఫ్రికా వంటి దేశాల్లో సఫారిల్లో జంతువులకు మనుషుల ఉనికి అలవాటు చేస్తారు. అందుకని అవి పెద్దగా పట్టించుకోవు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు జంతువులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా మెలగటానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఇలాంటి దాడులు చాలా అరుదు. వీరు వీలైనంత నిశ్శబ్దంగా పని చేస్తారు, ఇంకా కమొఫ్లాజ్ బట్టలు వేసుకోటం, కెమెరా లెన్స్‌కి కూడా అటువంటి కవర్లు వెయ్యటం చేస్తారు.
ఏ జంతువును ఫోటో తీయబోతున్నారో, దాని ప్రవర్తన, అలవాట్లు వంటి చరిత్ర ముందుగానే తెలుసుకుని వెళ్తారు. అలా చెయ్యటం తమ భద్రత కోసమే కాకుండా అద్భుతమైన ఫోటోలు తీయటానికి కూడా ఉపకరిస్తుంది.
అయినా జంతువుల దగ్గర ముందస్తు పథకాలు ప్రతిసారీ పనిచేస్తాయన్న గ్యారెంటీ ఉండదు – భాష, సంభాషణ సమస్య ఉండనే ఉంది కదా. అనుభవం లేని కొందరు అప్పుడప్పుడూ గీత దాటి ఇక్కట్ల పాలవ్వటం కూడా జరుగుతుంటుంది.