విమాన ప్రయాణమంటేనే విలాసవంతమైంది. ఎంతో ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కానీ ప్రయాణికులను అన్ని మాధ్యమాల్లో కన్నా వేగంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. అయితే బస్సు, రైలు వంటి ఇతర ఏ మాధ్యమంలో ప్రయాణించినా మనం మన స్మార్ట్‌ఫోన్లను ఎప్పటిలా మామూలుగానే వాడుతాం. కానీ విమానంలో వెళ్లే వారు మాత్రం తమ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో కచ్చితంగా ఉంచాల్సిందేనట. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజమే. తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి దీని గురించి తెలుస్తుంది, కానీ విమానం ఎక్కని వారికి ఈ విషయంపై అవగాహన ఉండదు. ఈ క్రమంలో అసలు విమానంలో వెళ్లినప్పుడు ఫోన్‌ను ఎయిర్ ప్లేన్ మోడ్‌లో ఎందుకు ఉంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
విమానంలో వెళ్లినప్పుడు ఫోన్‌ను ఎయిర్ ప్లేన్ మోడ్‌లో ఎందుకు ఉంచాలనే దాని గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమకు తోచింది అనుకుంటూ ఉంటారు. విమానంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్‌ను మామూలుగా వాడితే దాని నుంచి వచ్చే రేడియో తరంగాలు, విమాన రేడియో తరంగాలు క్లాష్ అయి విమానం కూలిపోయే ప్రమాదం ఉంటుందని కొందరు అనుకుంటే మరికొందరు మాత్రం ఇతర కారణాలు వేరే ఏవో ఉండి ఉంటాయని అనుకుంటారు. కానీ నిజం మాత్రం అదికాదు.
మనం భూమిపై ఉన్నప్పుడు మనం మారే ప్రదేశాలను బట్టి ఫోన్‌లో సిగ్నల్ కూడా మారుతుంటుంది. కాకపోతే సిగ్నల్ మరీ అంత వేగంగా అందుకునే స్పీడ్‌తో మనం భూమిపై వెళ్లం. కానీ గాలిలో 10వేల అడుగుల ఎత్తులో విమానంలో వెళ్తున్నప్పుడు సెల్ టవర్స్‌ను వేగంగా దాటుకుంటూ వెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలో ఫోన్లు కూడా వేగంగా సిగ్నల్‌ను క్యాచ్ చేస్తాయి. దీంతో పెద్ద ఎత్తున నెట్‌వర్క్ ప్రాబ్లం ఏర్పడి భూమిపై ఉన్నవారికి నెట్‌వర్క్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకోసమే విమానంలో వెళ్లేటప్పుడు ఎయిర్ హోస్టెస్‌లు మన ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టమని చెబుతారు. మనం అలా ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టకపోతే విమానం కూలిపోయే ప్రమాదం ఏమీ రాదు, కానీ మన ఫోన్ల నుంచి వచ్చే రేడియో తరంగాల వల్ల విమానంలోని రేడియో తరంగాలు స్వల్పంగా క్రాష్ అవుతాయి.
అప్పుడు పైలట్లకు వారి రేడియోల్లో అదో రకమైన గీచుకునే శబ్దం వినిపిస్తుంది. అదెలా ఉంటుందంటే ఏదైనా స్పీకర్ సిస్టమ్ వద్ద ఫోన్‌ను ఉంచితే అప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ… అదే. దాదాపు అలాంటి శబ్దమే పైలట్లకు వారి రేడియోల్లో వినిపిస్తుంది. దీంతో వారు ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టమని చెబుతారు. కాకపోతే ఫోన్‌కు ఫ్లైట్‌లో ఉండే వైఫైను కనెక్ట్ చేసుకుని మిగతా పనులు మాత్రం చేసుకోవచ్చు. కానీ రేడియో సిగ్నల్ మాత్రం పనిచేయదంతే.