మన దేశంలో లెక్క లేనన్ని చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర, స్థల పురాణం ఉంటుంది. వాటిని కట్టేందుకు కూడా చాలా రోజుల సమయం పడుతుంది. అయితే మీకు తెలుసా..? మన దేశంలో ఉన్న ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలు కొన్ని మాత్రం రాత్రికి రాత్రే నిర్మాణమై పోయాయట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..? గోవింద్ దేవ్ జీ మందిర్… ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. దీన్ని పూర్వం ఒకప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి ఒకే రాత్రిలో కట్టారట. అయితే వారు రాత్రంతా ఆలయం నిర్మిస్తూ సమయం చూసుకోలేదు. దీంతో తెల్లారిపోయింది. ఇక నిర్మాణం చేయకూడదని భావించి దాన్ని అలాగే వదిలేశారట. దీంతో ఆ ఆలయం ఇప్పటికీ కొంత అసంపూర్తిగానే కనిపిస్తుంది.
దేవ్‌ఘర్ మందిర్… జార్ఖండ్ రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. దీన్ని సాక్షాత్తూ విశ్వకర్మే నిర్మించాడట. ఈ ఆలయంలో మొత్తం 3 ఆలయాలు ఉంటాయి. ఒకటి విష్ణువుది, రెండోది శివునిది, మూడవది పార్వతి దేవిది. దీన్ని విశ్వకర్మ కేవలం ఒక రాత్రిలోనే నిర్మించాడట. అయితే ముందుగా ఆయన విష్ణువు, శివుడి ఆలయాలను కట్టాడట. కానీ అప్పటికే సమయం మంచి పోవడంతో పార్వతి దేవి ఆలయాన్ని చిన్నదిగా నిర్మించాడట. అందుకు అనుగుణంగానే ఇప్పటికీ ఆ దేవత ఆలయం అక్కడ చిన్నదిగా ఉంటుంది. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఓ లింగం ఉంది.
కంకణ్‌మఠ్… మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురైనా అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. శివున్ని ఆరాధించే కొంత మంది భక్తులు, ఆత్మలు కలిసి ఈ ఆలయాన్ని ఒకే రాత్రిలో నిర్మించాయట. హథియా దేవాల్… ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. దీన్ని ఒక చేయి మాత్రమే ఉన్న వ్యక్తి పూర్వం ఒకే రాత్రిలో నిర్మించాడట. అయితే ఈ ఆలయంలో ఉన్న శివ లింగం దక్షిణ దిక్కుగా ఉంటుందట. దీంతో ఆలయానికి దోషం వచ్చిందట. అందుకే అక్కడికి వెళ్లి ఎవరూ దర్శించుకునే సాహసం చేయరు. అలా చేస్తే అంతా దురదృష్టమే కలుగుతుందని నమ్ముతారు. భోజేశ్వర్ మందిర్… ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ద్వాపర యుగంలో దీన్ని పాండవులు ఒకే రాత్రిలో నిర్మించారట. కుంతీ దేవి అడిగినందుకు గాను పాండవులు ఈ ఆలయాన్ని కేవలం ఒకే రాత్రిలో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.