మన శరీరంలో లివర్ అనేది అతి పెద్ద అంతర్గత అవయవం. ఇది చేసే పనులు చాలా ముఖ్యమైనవి. శక్తిని నిల్వ చేయడం, అవసరం ఉన్నప్పుడు వాడడం, హార్మోన్లను కంట్రోల్ చేయడం, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వంటి అనేక పనులను లివర్ చేస్తుంది. అయితే లివర్ చేసే మరో ముఖ్యమైన పని కూడా ఉంది. అదే,శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపడం. ఈ క్రమంలో కొన్ని సార్లు లివర్ అనారోగ్యానికి గురవుతుంది. దీంతో పలు లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాటిని తెలుసుకుంటే చాలు, లివర్ అనారోగ్య సమస్య బారిన పడిందని చెప్పవచ్చు. దీంతో తగిన విధంగా జాగ్రత్త పడి, చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే లివర్ చెడిపోయిందని చెప్పడానికి మన శరీరంలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ వ్యాధి బారిన పడ్డారంటే ఎల్లప్పుడూ తీవ్రమైన అలసట ఉంటుంది. ఏ మాత్రం పని చేయలేరు. నిస్సత్తువగా ఉంటారు. చాలా వీక్‌గా ఉంటారు. ఏ పనిచేయకపోయినా అలసిపోయినట్టు ఉంటారు. వికారం ఉంటుంది. ఆకలి వేయదు. డయేరియా సమస్య వస్తుంది. దీన్ని బట్టి లివర్ చెడిపోయిందని అనుకోవచ్చు.
లివర్ వ్యాధి బారిన పడ్డారంటే జాండిస్ అటాక్ అవుతుంది. చర్మం పచ్చగా మారుతుంది. కళ్లు కూడా పచ్చగా తయారవుతాయి. వికారం, కడుపులో నొప్పి, వాంతులు అవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నా లివర్ వ్యాధి బారిన పడ్డారని తెలుసుకోవాలి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్ వస్తాయి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే రక్తం గడ్డ కడుతుంది. రక్త నాళాల వాపు కనిపిస్తుంది. దీంతో లివర్ ఆరోగ్యం బాగాలేదని అర్థం చేసుకోవాలి.
లివర్ పనిచేయకపోతే ఆకలి సరిగ్గా అవదు. ఎందుకంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తినందించేది లివరే. మరలాంటప్పుడు లివర్ పనిచేయకపోతే ఆకలి ఎలా అవుతుంది, అవదు కదా. కనక ఆకలి సరిగ్గా లేకపోతే లివర్ ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. లివర్ ఆరోగ్యం బాగా లేకపోతే పొట్ట, కాళ్లు వాపునకు గురవుతాయి. కానీ కొందరు దీన్ని కొవ్వు అనుకుని భ్రమ పడతారు. అయితే అది కొవ్వు కాదు. నీరు. నీరు చేరడం వల్లే ఆయా భాగాల్లో వాపులు కనిపిస్తాయి. ఇలా కనిపించినా లివర్ బాగా లేదని తెలుసుకోవాలి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తాయి. చర్మ స్పెషలిస్టుకు చూపించి మందులు వాడినా తగ్గకపోతే అప్పుడు దాన్ని లివర్ సమస్యగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.