Hair Fall : జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటేనే చూసేందుకు ఎవరికైనా చక్కగా అనిపిస్తుంది. అందవిహీనంగా జుట్టు ఉంటే ఎవరికీ నచ్చదు. అది ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. అందుకని శిరోజాలను సంరక్షించుకోవడం తప్పనిసరి. అయితే కొందరికి తీవ్రమైన జుట్టు సమస్యలు ఉంటాయి.
కొందరికి చుండ్రు ఎక్కువగా ఉంటే.. కొందరికి జుట్టు చిట్లిపోతుంది. కొందరికి జుట్టు అసలు పెరగదు. లేదా తక్కువగా పెరుగుతుంది. ఇక కొందరికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీంతో వారు ఆందోళనకు గురవుతారు. మహిళలు ఏమోగానీ పురుషులు అయితే జుట్టు బాగా రాలిపోతుంటే.. బట్టతల వస్తుందేమోనని ఖంగారు పడుతుంటారు. ఈ క్రమంలోనే జుట్టు రాలిపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో రోజూ మనం తీసుకునే ఆహారాలు కూడా ఒకటి అని చెప్పవచ్చు.
రోజూ మనం అనేక రకాల ఆహారాలను తింటుంటాం. పానీయాలను తాగుతుంటాం. అయితే ఆరోగ్యకరమైనవి అయితే జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. కానీ అనారోగ్యకరమైనవి అయితే జుట్టు పెరుగుదలకు సహకరించవు. పైగా జుట్టు రాలేందుకు కారణం అవుతాయి. ఈ క్రమంలోనే రోజూ మనం తీసుకునే ఎలాంటి ఆహారాల వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. జుట్టు రాలేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఆహారాలు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే జుట్టు బాగా రాలిపోతుంది. నిత్యం చక్కెర, తీపి పదార్థాలు ఎక్కువగా తినే వారి జుట్టు బాగా రాలిపోతుంది. ఎందుకంటే చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. ఇది డయాబెటిస్‌కు కారణం అవుతుంది. దీంతో స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ జుట్టు బాగా రాలిపోతుంది. అందువల్ల చక్కెర, తీపి పదార్థాలను తినరాదు. అలాగే పిండి పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోరాదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో జుట్టు రాలకుండా సురక్షితంగా ఉంటుంది.
2. కొన్ని రకాల ఆహారాలను తిన్న వెంటనే మన రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అంటే వాటిని గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఎక్కువగా ఉన్న ఆహారాలు అంటామన్నమాట. అలాంటి ఆహారాలను తింటే జుట్టు త్వరగా రాలిపోతుంది. వాటిల్లో మైదా పిండి, తీపి పదార్థాలు, వైట్ బ్రెడ్ వంటివి ఉంటాయి. కనుక వాటిని తీసుకోరాదు. లేదంటే జుట్టును బాగా కోల్పోవాల్సి వస్తుంది.
3. శిరోజాలు కెరాటిన్ అనే ప్రోటీన్ సహాయంతో తయారవుతాయి. కెరాటిన్ జుట్టుకు చక్కని పోషణను, దృఢత్వాన్ని అందిస్తుంది. అయితే మద్యం సేవించడం వల్ల కెరాటిన్‌పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీంతో జుట్టుకు పోషణ సరిగ్గా లభించదు. ఫలితంగా శిరోజాలు రాలిపోతాయి. కనుక మద్యం సేవించడం మంచిది కాదు. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
4. కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాల్లోనూ చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక వాటిని తీసుకుంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కనుక వాటిని మితంగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి.
5. బేకరీ ఐటమ్స్, ఇతర జంక్ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల కూడా జుట్టుకు పోషణ సరిగ్గా లభించదు. దీంతో జుట్టు రాలిపోతుంది. కనుక వాటిని కూడా తీసుకోరాదు.
6. జుట్టు పోషణకు కెరాటిన్ ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం కదా. అయితే మన శరీరంలో బయోటిన్ అనే పోషక పదార్థం వల్ల కెరాటిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కోడిగుడ్లను పచ్చిగా తీసుకోవడం వల్ల శరీరంలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది. దీంతో కెరాటిన్ ఉత్పత్తి సరిగ్గా అవదు. ఫలితంగా జుట్టుకు పోషణ లభించదు. దీంతో జుట్టు రాలిపోతుంది. కాబట్టి కోడిగుడ్లను పచ్చిగా తీసుకోరాదు. అయితే గుడ్లను ఉడకబెట్టి లేదా ఇతర మార్గాల్లో తీసుకుంటే అది జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితిలోనూ గుడ్లను పచ్చిగా తీసుకోరాదు.
7. చేపలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వారానికి రెండు సార్లు చేపలను తింటే మంచిదే. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చేపలను మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా.. శరీర ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. కనుక చేపలను మోతాదులో మాత్రమే తినాలి. అధికంగా తింటే సమస్యలు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.