ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్పి వ్యాపారిని మొదట ఆశ్రమమంతా తిరిగి రమ్మన్నాడు. విశాలమైన ఆశ్రమం అంతా తిరిగి అలసిపోయిన వ్యాపారి గురువు దగ్గరికి వచ్చి బాగా దాహంగా ఉందన్నాడు. సేవకులకు చెప్పి ఉప్పు నీళ్లు ఇప్పించాడు గురువు. వాటిని తాగిన వ్యాపారి, దాహం తీరలేదన్నట్టుగా ముఖం పెట్టాడు. అతడి వాలకం చూసి మరో గ్లాసు ఉప్పు నీళ్లు ఇచ్చారు సేవకులు. ఆశగా చేతిలోకి తీసుకుని వాటిని కూడా తాగేశాడు వ్యాపారి.
మరింత బాధగా ముఖం పెట్టి ఇంకా దాహంగా ఉంది అన్నాడు. మళ్లీ గ్లాసు ఉప్పు నీళ్లు ఇవ్వమని సేవకులకు చెప్పాడు గురువు. ఉప్పు నీళ్లు వద్దు, మంచి నీళ్లు ఇవ్వండి అని కోరాడు వ్యాపారి. ఎందుకు ఉప్పు నీళ్లు వద్దంటున్నారని ప్రశించాడు గురువు. ఉప్పు నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు. కాబట్టి మామూలు నీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు వ్యాపారి. అతను కోరినట్టే మంచినీళ్లు ఇప్పించాడు గురువు. ప్రతి నీటి చుక్కనూ చప్పరిస్తూ తృప్తిగా తాగి హమ్మయ్య… ఇప్పుడు దాహం తీరింది! అన్నాడు వ్యాపారి. చిన్నగా నవ్విన గురువు ఉప్పు నీళ్లు దాహం తీర్చవని గుర్తించావు కాని, ఎంత సంపాదించినా మన ఆశ దాహం తీరదని గుర్తించలేకపోతున్నావు. సంపాదించే కొద్దీ ఇంకా.. ఇంకా కావాలనిపిస్తుంది. దానికి అంతే ఉండదు అన్నాడు.
బాగా సంపాదిస్తేనే కదా వస్తువులను సొంతం చేసుకోగలం. సుఖాలను అనుభవించగలం అన్నాడు వ్యాపారి. బాగా సంపాదిస్తే వస్తువులను సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నావు. ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఆ వస్తువులే మనల్ని సొంతం చేసుకుంటున్నాయని గుర్తిస్తావు. ఆనందం అనేది వస్తువుల నుంచి రాదు. అది మనలో నుంచే వస్తుంది అని బదులిచ్చాడు గురువు. సంపద మాయలో పడి జీవిత సత్యాన్ని మరచాను అని గుర్తించి అక్కడినుంచి కదిలాడు వ్యాపారి.