నేటి తరుణంలో సెల్‌ఫోన్ వాడకం ఎంత ఎక్కువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ పడుకునే వరకు సెల్‌ఫోన్ వాడకం మన నిత్య కార్యక్రమాల్లో ఒకటిగా మారిపోయింది. ఏం ఉన్నా లేకున్నా చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, దాంతో మస్త్ టైం పాస్ చేస్తున్నారు. అయితే సెల్‌ఫోన్ల వాడకం ఎక్కువవడం ఏమోగానీ ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య నెట్‌వర్క్. కాల్స్ కలవకపోవడం, ఒక వేళ కలిసినా వెంటనే డ్రాప్ అవడం, మాట్లాడుతూ ఉండగానే సిగ్నల్ సరిగ్గా అందక కాల్ కట్ అవడం వంటి సమస్యలను దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నెట్‌వర్క్ వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఫోన్‌లో సిగ్నల్ పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఫోన్‌లో సిగ్నల్ సమస్యగా ఉంటే ఒక సారి డివైస్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. దీంతో ఫోన్ కొత్త టవర్ సిగ్నల్ కోసం వెదుకుతుంది. ఈ క్రమంలో సిగ్నల్ కొంత మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఫోన్‌లో ఉన్న ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేసి ఆన్ చేస్తే మాత్రం సిగ్నల్ పెరగదు. మీ ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉన్నా సిగ్నల్ తక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే డివైస్‌లో అంతర్గతంగా బ్యాటరీని పొదుపు చేసే మెకానిజం బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఇది ఫోన్‌లోని సిగ్నల్‌ను తగ్గించి బ్యాటరీని పొదుపు చేసేందుకు యత్నిస్తుంది. కాబట్టి బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్‌ను చార్జింగ్ పెట్టాలి. లేదంటే సిగ్నల్ తక్కువగా వస్తుంది. అయితే చార్జింగ్ అందుబాటులో లేకపోతే ఫోన్‌లో ఉన్న బ్యాటరీ సేవిండ్ మోడ్‌లను ఆఫ్ చేయాలి. దీంతో సిగ్నల్ పెరుగుతుంది. కాల్స్ చేసుకోగానే మళ్లీ బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయాలి. లేదంటే తక్కువగా ఉన్న బ్యాటరీ ఇంకా ఫాస్ట్‌గా ఖర్చవుతుంది.
సాధారణంగా ఏ ఫోన్‌కైనా దాని సిగ్నల్ యాంటెన్నా వెనుక భాగంలో పైన ఉంటుంది. కొన్నింటికి వెనుక భాగంలో దిగువన ఉంటుంది. కనుక ఈ రెండు ప్రదేశాలను వీలైనంత వరకు చేతులతో కవర్ చేయకూడదు. ఓపెన్‌గా ఉంచి, మిగతా ప్రాంతంలో ఫోన్‌ను పట్టుకోవాలి. దీంతో ఫోన్‌కు సిగ్నల్ సరిగ్గా అందుతుంది. నాలుగు గోడలు, బిల్డింగ్‌లు, చెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి మధ్య సిగ్నల్ తక్కువగా వస్తుంది. కనుక వీలైనంత వరకు ఓపెన్ ప్రదేశంలో ఉండి కాల్స్ చేసుకోవడానికి యత్నించండి. బిల్డింగ్‌లైతే వాటి పైకి వెళ్తే సిగ్నల్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్‌ఫోన్ రేడియో తరంగాలు భూమికి కొంత ఎత్తులో ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. కనుక వాటిని ఫోన్ అందుకుంటే సిగ్నల్ మెరుగు పడుతుంది.
ఒకే దగ్గర నిలబడి ఉండి మాట్లాడడం కన్నా, అటు, ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతుంటే దాంతో సిగ్నల్ పెరుగుతుంది. ఏ నెట్‌వర్క్ టవర్ నుంచి వచ్చే సిగ్నల్ అయినా ఒకే డైరెక్షన్‌లో వెళ్తుంది కాబట్టి కొన్ని సార్లు వలయాకారంలో (సర్కిల్ ఆకారంలో) తిరుగుతూ మాట్లాడడం వల్ల సిగ్నల్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ పాటించినా సిగ్నల్ సరిగ్గా రావడం లేదంటే అది మీ ఫోన్‌లోనో లేదంటే మీ నెట్‌వర్క్ ఆపరేటర్ వల్లో అయి ఉంటుంది. కనుక ఫోన్‌ను మార్చి లేదంటే నెట్‌వర్క్ ఆపరేటర్‌ను మార్చి చూస్తే సమస్య ఎందులో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది.